ఫ్లెమింగో

 ఫ్లెమింగో అనేవి పక్షిజాతికి చెందినవి. ఇవి ఒక రకం కొంగలు. ఫ్లెమింగో అనేది స్పానిష్ పదం. ఈ పదానికి అగ్ని అని అర్ధం. ఫ్లెమింగో పక్షుల రెక్కలు ఎర్రగా వుండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది.

ఫ్లెమింగోలు ఆఫ్రికా, అమెరికా ఖండాలలో ఎక్కువగా వుంటాయి. అగ్నిపర్వతాలు ఏర్పడే ప్రాంతాలలో బూడిద, రసాయనాలు, లావా నిండిన ప్రాంతాలలో కూడా ఫ్లెమింగోలు జీవించగలవు.

అయితే ఫ్లమింగోలు అప్పుడప్పుడు దూరప్రాంతాలకు వలసవెళుతుంటాయి. గంటకు ముప్పై అయిదు కిలోమీటర్లు ఎగరగలవు. మన రాష్ట్రంలో పులికాట్, కొల్లేరు సరస్సులకు ఇవి వలస వచ్చి కొంతకాలం అక్కడ వుండి, మళ్లీ తిరిగి వెళ్లిపోతాయి. వీటిని చూడటానికి పర్యాటకులు ప్రత్యేకంగా వెళుతుంటారు. దీన్నే ఫ్లెమింగో ఫెస్టివల్ అంటారు.

ఫ్లెమింగోలు స్పిరులైనా అనే నీటి ఆల్గేను ఎక్కువగా తింటాయి. పుట్టినప్పుడు బూడిద రంగులో వుండి, ఆల్గేను తినడం వల్ల అవి క్రమంగా ఎరుపు రంగులోకి మారిపోవడం విచిత్రం.

ఇవి నీటిలో ఎప్పుడూ ఒంటికాలి మీదే నిలబడతాయి. ఫ్లెమింగోల గుంపును ఫ్లాక్ అంటారు. వీటి మెడ నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. పొడవుగా, పాములాగా ఉండే ఈ మెడలో మొత్తం 19 ఎముకలు ఉంటాయి. ఆడ ఫ్లమింగోలు సంవత్సరానికి ఒకే ఒక్క గుడ్డు పెడతాయి. పొరపాటున ఈ గుడ్డుకు ఏదైనా అయినా కూడా మరో గుడ్డు పెట్టేందుకు ప్రయత్నించవు. వీటికి పరిశుభ్రత చాలా ఎక్కువ. రోజులో ఎక్కువభాగం ఇవి తమ శరీరాన్ని శుభ్రపరచుకోవడానికే ఉపయోగిస్తాయి.

నెమలి

*** నెమళ్లలో మూడు రకాలున్నాయి. మొదటి రకం బ్లూ పీకాక్. శ్రీలంర, భారతదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. రెండో రకం గ్రీన్ పీకాక్. ఇది ఎక్కువగా జావా, మయన్మార్ ప్రాంతాల్లో ఉంటాయి. మూడో రకము కాంగో పీకాక్‌లు. ఇవి ఆఫ్రికా వర్షారణ్యాల్లో ఉంటాయి.

*** నెమళ్లు అన్నింటినీ పీకాక్ అనకూడదు. మగవాటిని మాత్రమే పీకాక్ అనాలి. ఆడవాటిని పీహెన్స్ అంటారు. అలాగే నెమలి పిల్లల్ని పీ చిక్స్ అనాలి.అన్నిటినీ కలిపి పీహౌల్స్ అని పిలవాలి. నెమలి గుంపును పార్టీ అనిగాని, ప్రెడ్ అనిగాని అనాలి.

*** పింఛం అన్ని నెమళ్లకు ఉండదు. కేవలం మగ నెమళ్లకే పింఛం ఉంటుంది. నెమలి బరువులో అరవై శాతం దాని పింఛానిదే. 

*** ఇవి వేగంగా పరుగెత్తలేవు. అందుకే శత్రువులు దాడి చేస్తారని గ్రహించగానే చెట్లెక్కేస్తాయి. ఆ భయంతోనే రాత్రిళ్లు చెట్లమీదే నిద్రపోతాయి. 

*** ఆడ నెమళ్లు తమ జంటను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాయి. పొడవు, దారుఢ్యం, పింఛంలోని రంగులను చూసి మరీ నచ్చినవాటిని ఎంపిక చేసుకుంటాయి.

*** నెమళ్లు ఎంతో అందంగా ఉంటాయి కాని వాటి అరుపు కర్ణకఠోరంగా ఉంటుంది. ఙఠాత్తుగా వింటే ఆ అరుపు స్త్రీ ఏడుపులా అనిపిస్తుంది.

*** నెమళ్లు చాలా పిరికివి. పులులు, సింహాలే అక్కరలేదు. పిల్లలు, కుక్కలకు కూడా జడిసిపోతాయి. 

 

హమ్మింగ్ బర్డ్

పక్షులన్నీ ముందుకు మాత్రమే ఎగురుతాయి. కానీ హమ్మింగ్ బర్డ్ వెనుకకు కూడా ఎగరగలుగుతుంది. ఇది దీని ప్రత్యేకత. అంతేగాక ఇది పైకి, కిందకి, పక్కలకు కూడా ఎగరగలదు.

హమ్మింగ్ బర్డ్ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి. వీటి ఎత్తు సుమారు 6 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇవి అమెరికాలోని క్యూబాలో ఎక్కువగా ఉంటాయి. హమ్మింగ్ బర్డ్ చాలా ఎక్కువ దూరం ఎగరగలదు. ఇది ఒకసారి ఎగరడం ప్రారంభించిందంటే ఆగకుండా 800 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

హమ్మింగ్ బర్డ్ పూలలోని తేనెను ఆహారంగా తీసుకుంటుంది. ఇది అవడానికి చిన్న పక్షి అయినా ఆహారం దండిగా తీసుకుంటుంది. దీని ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. ముక్కును పూలలోనికి దూర్చి మకరందాన్ని లాగుతుంది.

హమ్మింగ్ బర్డ్ చాలా ఎక్కువ వేగంగా రెక్కలు ఆడిస్తుంది. ఇది నిమిషానికి 4800 సార్లు రెక్కలు ఆడిస్తుంది. దీనికి పొడవైన తోక కూడా ఉంటుంది.


 

             

                చిలుకలు


***           ప్రపంచంలో మొత్తం 372 రకాల చిలుకలు

 ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఉష్ణమండలాల్లోనే 

జీవిస్తున్నాయి.

***       చిలుకలకు గ్రహణ శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా

 చాలా ఎక్కువ. అందుకే మనుషుల మాటలను అవి త్వరగా

 గ్రహిస్తాయి. వాటిని గుర్తు పెట్టుకుని తిరిగి వల్లె వేస్తాయి.

 అయితే అన్ని జాతుల చిలుకలూ అలా చేయలేవు. కొన్నే

 చేయగలవు. మనుషుల స్వరాన్ని అనుకరించడంలో

 ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్‌దే ప్రధమస్థానం.

***      సాధారణంగా పక్షులు నేల మీద ఉన్న ఆహారాన్ని 

ముక్కుతో పట్టి తినేస్తాయి. కాని చిలుకలు మాత్రం కాళ్లతో 

తీసుకుని నోట్లో పెట్టుకుని తింటాయి.

***             చాలా రకాల చిలుకలు దాదాపు ఎనభై ఏళ్ల 

వరకూ జీవిస్తాయి. కానీ కొన్ని జాతులు పదిహేనేళ్లు మాత్రమే

 బతుకుతాయి.

***              చిలుకలు మహా సరదాగా ఉంటాయి. వాటికి 

ఆడుకోవడం చాలా ఇష్టం. వాటి ఆట ఎలా ఉంటుందంటే

 చుట్టుపక్కల ఉన్న వస్తువులను కొరకడం, ముక్కుతో

 పొడవడం వంటివి చేస్తుంటాయి. అదే వాటి ఆట.

***      చిలుకల ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి.

 చిన్న దెబ్బలు కూడా వాటి ప్రాణాన్ని తీసేయగలవు.

***        వీటిలో ఎడమ చేతి (కాలు) వాటం ఉంటుంది. ఏ 

కాలితో ఆహారాన్ని తీసి నోటిలో పెట్టుకుంటాయో, వాటిది ఆ

 వాటం అన్నమాట.

***            ప్రయత్నిస్తే చిలుకలకు పదిహేడు వందల 

మాటలవరకూ నేర్పవచ్చు. అవి అన్ని గుర్తుపెట్టుకోగలవు.

***            తీయని కబుర్లు చెబుతాయన్న మాటే గాని

 చిలుకలకు స్వర పేటిక ఉండదు. శ్వాసనాళంలోకి గాలిని 

బలంగా పీల్చి వదలడం ద్వారా అవి శబ్దాలను సృష్టిస్తాయి.

 

               కుందేలు

*** కుందేళ్లు ఎలాంటి ప్రదేశంలో అయినా జీవించగలవు. గడ్డి

 మైదానాలు, వర్షారణ్యాలు, చివరకు ఎడారుల్లో కూడా అవి 

బతగ్గలవు.

*** ఇవి పగలు కంటే రాత్రిపూట ఎక్కువ ఆహారాన్ని

 తీసుకుంటాయి.

*** కుందేలు సంవత్సరంలో మూడుసార్లు బిడ్డల్ని కంటాయి.

 వీటి పిల్లలను కిట్స్ అంటారు. పుట్టినప్పుడు వీటికి చూపు 

ఉండదు. ఒంటిమీద బొచ్చు కూడా ఉండదు.

*** వీటి దృష్టికోణం 360 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే ఇవి 

తమ వెనుక ఉన్నవాటిని కూడా తల తిప్పకుండానే 

చూడగలవు.

*** కుందేళ్లకు ఇరవై ఎనిమిది పళ్లుంటాయి. ఇవి జీవితాంతం

 పెరుగుతూనే ఉంటాయి. వీటి గుండె నిమిషానికి 130 నుంచి

 325 సార్లు కొట్టుకుంటుంది.

*** వీటికి ఆనందం వస్తే నానా హంగామా చేస్తాయి. 

ఎగురుతాయి, ఎత్తులెక్కి దూకుతాయి, అడ్డదిడ్డంగా 

పరుగులు తీస్తాయి, కాళ్లు నేలకేసి టపటపా కొడుతుంటాయి.

*** కుందేళ్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవు. 

తోడులేకపోతే విసిగిపోతాయవి.

*** కొన్నిసార్లు ఆహారమే కుందేళ్ల పాలిట విషమవుతూ 

ఉంటుంది. ఎందుకంటే, తిన్న ఆహారం త్వరగా జీర్ణంకాకపోతే

 అదే విషమై ప్రాణాలు తీస్తుంది. అందుకే గట్టిగా ఉండే 

ఆహారాన్ని ముట్టవు కుందేళ్లు. పీచు పదార్ధాలు ఎక్కువగా 

ఉండే గడ్డి, కూరగాయలు, పండ్లు, దుంపలు వంటి వాటినే 

తింటూ ఉంటాయి.

*** మగ కుందేళ్లను బక్స్, ఆడ కుందేళ్లను డాస్ అంటారు. 

 
మొక్కలు  పచ్చగానే ఎందుకు
సాధారణంగా మొక్కలన్నీ పచ్చగానే ఉంటాయి. వాటిలో క్లోరోఫిల్ అనే పత్రహరితం ఉండటమే అందుకు కారణం. హిమోగ్లోబిన్ ఉండటం వల్ల రక్తం ఎరుపు రంగులో ఉన్నట్లుగా ..... క్లోరోఫిల్ ఉండటం వల్ల కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథసిస్) ద్వారా క్లోరోఫిల్ సూర్యరశ్మిలోని నీలి, ఎరుపు రంగు కాంతులను గ్రహించి, వాటిని ఆకుపచ్చ, పసుపు పచ్చ కాంతులుగా మార్చుతుంది. దానిద్వారా సూర్యరశ్మిలోని కాంతిని శక్తినిచ్చే చక్కెరలుగా మార్చుకుంటుంది. అంతేకాదు, మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, ఆక్సిజన్‌ను విడిచిపెట్టడంలో క్లోరోఫిల్ కీలకపాత్ర పోషిస్తుంది. అంటే మొక్కలలో ఉండే క్లోరోఫిల్ వాటినే కాదు, మనిషి మనుగడకు అవసరమైన ప్రాణవాయువును అందిస్తూ, మనం కూడా పచ్చగా ఉండేటట్లు చేస్తుందన్నమాట. క్లోరోఫిల్ లేకపోతే మొక్కలు వేరే రంగులో ఉండేవేమో ...

ఉత్తర దక్షిణ ధృవాలు చూపే చెట్టు

                            పైలట్ వీడ్ అనే మొక్క ఆకులు బల్లెం ఆకారంలో ఉండి ఉత్తర దక్షిణదృవాలను చూపుతుంటాయి. ఈ మొక్క సిలిఫీయం లిసినైటం కుటుంబానికి చెందినది. దిక్కులు చూపించడం వల్ల దీన్ని దిక్సూచి మొక్క అని కూడా అంటారు. ఇది ఒక రకం గడ్డిమొక్క.

                      ఈ మొక్క3.5 మీటర్ల ఎత్తు ఎదుగుతుంది. దీనికి పెద్ద పెద్ద పసుపు రంగు పూలు పూస్తాయి. ఈ మొక్కకు ఉండే బల్లెం ఆకారపు ఆకులు ఉత్తర దక్షిణాలకు తిరుగుతూ ఉంటాయి. సూర్యరస్మి ద్వారా కిరణజన్య సంయోగక్రియ కోసం ఇలా జరుగుతుందని వృక్షశాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

          మధ్య, పశ్చిమ అమెరికాలో ఈ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. 

ఎండకు ఆకులు వేడెక్కవు

ఆకులకు అడుగు భాగాన సన్నటి రంధ్రాలు (స్టొమేటా) ఉంటాయి. ఇవి పగటి పూట తెరుచుకుని ..... కార్బన్‌డయాక్సైడ్‌ను ఆకు పీల్చుకునేలా చేయడమే గాక ఆక్సిజన్, నీటి ఆవిరిని వదిలేలా చేస్తాయి. అవి రాత్రి సమయంలో మూసుకుని ఉంటాయి. ఎండ బాగా ఉన్న సమయంలో ఆకుల్లోంచి వచ్చే నీటిఆవిరి శాతం పెరుగుతుంది. తిరిగి వేళ్ల ద్వారా కోల్పోయిన నీటిని ఆకు పొందుతుంది. అంటే ఆకులు గ్రహించిన వేడి వాటిలోని నీరు ..... ఆవిరిగా మారేందుకు ఉపయోగపడుతుందే కాని ఆకుల్ని వేడెక్కించదు. కోల్పోయిన నీటిని ఆకులు భూమి నుండి గ్రహిస్తుండడం వల్ల ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. దీనిని బాష్పోత్సేకం అంటారు. వేళ్లకు నీరు అందుతున్నంత కాలం ఎంత ఎండకాసినా ఆకులు వేడెక్కవు.  

పండిపోయిన ఆకులు పసుపు రంగులోకి మారటం ---

దాదాపుగా అన్నిరకాల ఆకులు ఆకుపచ్చగానే వుంటాయి. ఆకులలోవుండే క్లోరోఫిల్ అనే పదార్ధం వల్ల ఆకులు ఆకుపచ్చగా కనబడతాయి. క్లోరోఫిల్ (పత్రహరితం) ఆకులు కిరణజన్య సంయోగక్రియ జరిపి పిండిపదార్ధాలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఆకులు చాలాకాలం పాటు ఆకుపచ్చగానే వున్నప్పటికీ రాలిపోయేదశలో ముందుగా పసుపు రంగులోకి మారి, తర్వాత రాలిపోతాయి. ఆకులలో కాడ మొదలులో ఒక విచ్చేదకపొర ఆకులు పండిపోయే దశలో ఏర్పడుతుంది. దాంతో వేళ్లు పీల్చుకున్న నీళ్లు కాండం ద్వారా ఆకులకు అందదు. నీరు లేకపోతే ఆకులలో కణాలు నశిస్తాయి. దీంతో ఆకులలో క్లోరోఫిల్ నశించిపోయే, కెరోటిన్ జెన్‌థోఫిల్ అనే పసుపు రంగు వర్ణద్రవం ఏర్పడుతుంది. దీనివల్ల పండిన ఆకులు ఆకుపచ్చదనం కోల్పోయి, పసుపురంగుగా మారతాయి. ఇవే ఆ తర్వాత త్వరగా రాలిపోతాయి.  

మిణుగురు పురుగుకు వెలుగు

మిణుగురుపురుగులు వర్షాకాలంలో చీకటిపడ్డాక చెట్లు చేమలలో వెలుగుతూ, ఆరుతూ నెమ్మదిగా ఎగురుతూ, ఆశ్చర్యం గొలిపేలా, సృష్టిలో ఒక ప్రత్యేకతతో కనిపిస్తాయి.

మిణుగుపురుగుల శరీరంలో జరిగే కొన్ని రసాయనిక క్రియల వల్ల ఈ వెలుతురు జనిస్తుంది. ఈ కాంతిని ఉత్పత్తిచేసే రసాయనాన్ని ల్యూసిఫేరిన్ అంటారు. ఇది ఆక్సిజన్‌తో కలిస్తే అందులోని రసాయన శక్తి జ్యోతిశక్తిగా (వెలుగుగా) మారుతుంది. ఐతే ఈ ల్యూసిఫేరిన్ దానంతట అది ఆక్సిజన్‌తో సంయోగం చెందదు. ఈ ప్రక్రియ జరగడానికి మరొక ఉత్ప్రేరకం అవసరం. దీన్ని ల్యూసిఫెరేజ్ అంటారు. ఇది జరిపించే రసాయన చర్య పట్ల వెలుతురు వస్తుంది.

అంటే మిణుగురుపురుగులో ల్యూసిఫేరిన్, ల్యూసిఫెరేజ్ అనే రెండురకాల రసాయనాలు వుంటాయి. ల్యూసిఫేరిన్ ఆక్సిజన్‌తో కలిసి వెలుగును జనింపజేయడానికి ల్యూసిఫెరేజ్ సాయపడుతుంది. 

కీచురాళ్లు ఎలా అరుస్తాయి

            కీచురాళ్లు చిన్నవిగా వుంటాయి. కేవలం ఒక 

అంగుళం పొడవు వుండే చిన్న కీటకం కీచురాయి.కానీ అది 

అరవడం మొదలు పెట్టిందంటే చెవులు చిల్లులు పడిపోతాయి.

 ఆపకుండా అరుస్తూనే వుంటుంది.ఎంత వెతికినా అది ఎక్కడ

 వుందో మాత్రం కనబడదు.

             అయ్తే కీచురాళ్లు చేసే ఆ శబ్దం అవి నోటితో చేయవు

. ఘరుకుగా, ఈనెలుగా వుండే తన రెక్కల మీద గరుకైన తమ

 గోళ్లతో గిటారు వాయించినట్లు రాస్తూ, ఆ శబ్దం చేస్తయి.


             కీచురాళ్లు సాధారణంగా పగలంతా మౌనంగా వుండి,

 రాత్రివేళల్లో మాత్రమే ఇలాంటి శబ్దాలు చేస్తాయి. కొన్ని 

ఋతువులలో, ముఖ్యంగా వర్షాకాలంలో కీచురాళ్లు చాలా 

ఉత్సాహంగా ఇలాంటి అరుపులు చేస్తంటాయి. ఆడ 

కీచురాళ్లను ఆకర్షించడానికి మగ కీచురాళ్లు ఇలా శబ్దం 

చేస్తాయి.కీచురాళ్ల శబ్దం కఠోరంగా, చిరాకు కలిగించేలా 

వుంటుంది.

             కీచురాళ్లలో చాలా రకాలు వున్నాయి. ఎక్కువగా 

పాడుబడిన ప్రాంతాల్లో, జనవాసం అంతగా లేని ప్రాంతాల్లో ఇవి

 ఆవాసం ఏర్పరచుకుంటాయి. మట్టి ప్రాంతాలు అంటే వీటికి

 చాలా ఇష్టం. కొన్ని కీచురాళ్లు నేలలో రంధ్రాలు చేసుకుని 

వుంటాయి. కొన్ని అరుదుగా చెట్ల మీద కూడా 

నివసిస్తుంటాయి. గోడల పగుళ్లలో కూడా వుంటాయి.

               

ఉమ్మి

ఉమ్మినే లాలాజలం అనికూడా అంటారు. మన నోటిలో నిరంతరం లాలాజలం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మనం ఏదైనా పదార్ధాన్ని నోటిలో పెట్టుకొని నమలగానే లాలాజలం ఉత్పత్తి కాకపోతే అది గొంతులోకి జారదు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో లాలాజలం ఈ విధంగా ప్రధానపాత్ర పోషిస్తుంది. చాలాసేపు మనం నోరు మూసుకుని ఉన్నట్లయితే లాలాజలం ఊరదు. అందుకే నోరు దుర్వాసన వస్తుంది. మనం నిద్రపోయి లేవగానే నోరు వాసన వచ్చేది అందుకే. అంటే లాలాజలం మన పంటి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందన్నమాట. మరో విషయం .... మనం తీసుకునే ఆహారం లేదా పానీయం ఉప్పగా, తీయగా, పుల్లగా, చేదుగా, కారంగా, వగరుగా .....ఇలా దాని రుచి ఏమిటో తెలిసేది లాలాజలం వల్లనే. ఇంతకూ ఈ లాలాజలం ఎలా ఉత్పత్తి అవుతుందంటే మన నోటి కింది భాగాన, చెంపలకు ఇరుపక్కలా, రెండు దవడల కిందా లాలాజలం గ్రంధులు ఉంటాయి. వీటినుంచి రోజుకు దాదాపు ఒకటి నుంచి రెండు లీటర్ల వరకు లాలాజలం ఉత్పత్తి అవుతుంది. కొందరు రోగులు కొన్ని మందులు వాడటం వల్ల వారి నోటిలో తగినంత పరిమాణంలో లాలాజలం ఉత్పత్తి అవ్వదు. అందుకే వారిలో అరుగుదలకూడా లోపిస్తుంది. 

 కళ్లెందుకు ఆర్పుతాం

అప్పుడే కన్ను తెరిచిన పసిబిడ్డ దగ్గరనుంచి, మరికొద్ది క్షణాలలో కన్నుమూయబోయే వారి వరకు ప్రతి ఒక్కరూ కళ్లు ఆర్పుతుంటారు. కళ్లు ఆర్పడం లేదా రొప్ప కొట్టడానికి సెకండులో పదో వంతు సమయం చాలు. ఇంతకూ కళ్లెందుకు ఆర్పుతామంటారు? మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎంతో దుమ్ము, ధూళి ఉంటుంది. కళ్లు ఆర్పుతూ, మూస్తూ ఉండటం ద్వారా దుమ్మూ ధూళి కళ్లలో పడకుండా, కళ్లు శుభ్రంగా ఉంటాయి. కంటిలో ఊరే కందెనలాంటి ద్రవం కనుగుడ్ల మీద సమంగా పరుచుకొని, గుడ్లు పొడిబారకుండా ఉంటాయి. తీవ్రమైన కాంతి కంటి మీద పడి, కంటిపొర దెబ్బతినకుండా ఉంటుంది. సగటున పదిసెకనులకోసారి కళ్లు ఆర్పుతుంటామని పరిశోధనలు చెబుతున్నాయి. కళ్లు ఆర్పిన సమయంలో చీకటిగా లేకుండా, మనం నిరంతరాయంగా చూస్తూనే ఉన్న భావన కలిగేలా మెదడు సంకేతాలు పంపుతుంది. అన్నట్లు దేవతలు కళ్లు ఆర్పరట.అందుకే దేవతలకు అనిమేషులు, అంటే రెప్పపాటు లేనివారు అని పేరు. 

ఆవులింత ఎందుకు వస్తుంది

పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఆవలించని వారుండరు.మనం మాట్లాడేటప్పుడు లేదా ప్రసంగించేటప్పుడు లేదా క్లాసులో టీచరు పాఠం చెప్పేటప్పుడు అవతలివారు ఆవలించారంటే మనం చెబుతున్న విషయం వారికి అంత ఆసక్తికరంగా లేదేమో అని అనుమానం వస్తుంది.

ఇంతకీ ఆవులింత ఎందుకు వస్తుంది. ఒక్కొక్కసారి మన శ్వాసక్రియలో వేగం తగ్గి, ప్రాణవాయువు తీసుకునే శక్తి క్షీణిస్తుంది. ఫలితంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గి, కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో  తగినంత ఆక్సిజన్ పీల్చుకోవలసిందని నోటికి, ముక్కుకి సంకేతాలు పంపుతుంది. మెదడు అప్పుడు అప్రయత్నంగానే ఆవలింత వస్తుంది.

మరో పరిశోధన ప్రకారం ఆవలింత వల్ల ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులలోని కణజాలం వ్యాకోచిస్తాయి. కీళ్లలోను, కండరాల్లోనూ కదలికలు పెరుగుతాయి. గుండె స్పందన పెరుగుతుంది. ఫలితంగా శరీరానికి ఒకవిధమైన విశ్రాంతి స్థితి అంటే రిలాక్సేషన్ ఫీలింగ్ కలుగుతుంది. ఆవలింత వల్ల రక్తంలో ఆక్సిజన్ పాళ్లు పెరిగి, కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్లిపోతుంది. అంటే ఆవలింత కూడా మంచిదేనన్నమాట. 

రక్తం గడ్డ కట్టటం

                   శరీరంలో ఏభాగానికైనా గాయమైనప్పుడు రక్తం

 వన్తుంది. అయితే కొంచెంసేపటికే రక్తం గడ్డకట్టి, రక్తం 

స్రవించడం ఆగిపోతుంది.

                  రక్తంలో ద్రవపదార్ధంలాంటి ప్లాస్మాకాకుండా

 ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స అనే మూడు రకాల

 కణాలు కూడా వుంటాయి. రక్తం గడ్డకట్టడానికి ఈ ప్లేట్‌లెట్సే

 కారణం. గాయం తగిలినప్పుడు ప్లేట్‌లెట్స్ గాయం చుట్టూ చేరి 

రక్తంలోని ప్లాస్మానుంచి త్రాంబో ప్లాస్టిన్ అనే పదార్ధాన్ని 

తయారు చేస్తాయి. ఈ పదార్ధం రక్తంలోని కాల్షియం, 

ప్రోత్రాండిన్‌లతో కలుస్తుంది. ఇవి ఫైబ్రొనోజిన్ అని రక్తంలో 

వుండే ఒక ప్రొటీన్‌తో ప్రతిక్రియ జరుపుతాయి. దాంతో ఫైబ్రెన్ 

ఏర్పడుతుంది.

                ఫైబ్రెన్ దారాలు ఒక దానితో ఒకటి 

పెనవేసుకునిపోయి రక్తాన్ని బయటకు పోనివ్వకుండా ఒక 

విధమైన అడ్డుకట్టలాగ నిలుస్తాయి. దాంతో ఫైబ్రెన్ దారాలు 

గట్టిగా అతుక్కుపోతాయి. ఈ కణాలపైపొర చనిపోతుంది. 

దెబ్బతిన్న కణాల స్ధానంలో కొత్త కణాలు వచ్చాక పైన ఏర్పడిన

 పొర ఊడిపోతుంది. ప్లేట్‌లెట్స్ నుండి సిరోటినిన్ అనే హర్మోను

 ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తాన్ని సంకోచింపజేస్తుంది. దాంతో

 రక్త ప్రవాహం ఆగిపోతుంది.               


చర్మం

         మనిషి శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. దేహానికి బయటి పొర చర్మం.

         చర్మం బయటి పొరను ఎపిడెర్మిస్ అంటారు. ఇందులో అయిదు పొరలు వుంటాయి. ఈ పొరలలోని కణాలు చనిపోయి, బయటకు పోయి ఎప్పటికప్పుడు కొత్తకణాలు వస్తుంటాయి. ఈ పొరలలోనే మెలనిన్ అనే పదార్ధం వుంటుంది. దీనివల్లనే చర్మానికి రంగు కలుగుతుంది.రెండవ పొరను డెర్మిస్ అంటారు. ఇందులో రక్తనాళాలు, చెమట గ్రంధులు, కొవ్వుకణాలు, నాడులకొనలు వుంటాయి.

          చర్మం అనేక కణాలతో తయారై ఉంది. చర్మం శరీరానికి రక్షణ పొరగా పనిచేస్తుంది. అంతర్భాగాలను రోగకారక క్రిముల బారి నుండి రక్షిస్తుంది. స్పర్శజ్ఞానాన్ని కలిగిస్తుంది. శరీరంలో అధికమైన ఉష్ణోగ్రతను బయటకు పంపించి శరీర ఉష్ణోగ్రతను సమంగా వుంచుతుంది. సూర్యరశ్మి నుండి శరీరానికి కావలసిన విటమిన్ - డి ని ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని ద్రవపదార్ధాలను రక్షిస్తుంది.

            చర్మం 0.05 నుండి 0.65 సెంటి మీటర్లు మందంలో వుంటుంది. చర్మం కనురెప్పల మీద పలుచగాను, అరికాలులో మందంగాను వుంటుంది.

అలసట

                    శరీరంలో కండరాలు పనిచేస్తున్నప్పుడు అక్కడ లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఒక పరిమితికి మించి అధికంగా తయారైతే అక్కడ కండరం తాత్కాలికంగా పనిచేయలేని స్థితి ఏర్పడుతుంది. శాస్త్రీయంగా దీన్నే అలసట అని పేర్కొంటారు.

            కొంతసేపు విశ్రాంతి ఇచ్చినట్లయితే అలసిపోయిన కండరాల్లో వున్న అధికమైన లాక్టిక్ యాసిడ్ రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరి అక్కడ ఫిల్టర్ అయి, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. లాక్టిక్ యాసిడ్ వెళ్లిపోయిన తర్వాత అలసట తీరిన ఆ కండరం తిరిగి పనిచేయడం ప్రారంభిస్తుంది.

             ఈ పని అంతా జరగడానికి కొంత వ్యవధి కావాలి. అయితే మరేదైనా పద్ధతిలో ఆ కండరంలో నిల్వ అయిన లాక్టిక్ యాసిడ్‌ను అతి త్వరగా తొలగించగలిగితే ఆ కండరం అలసట అనేది లేకుండా మరికొంత సమయం పని చేయగలుగుతుంది. 

                పగటిపూట శరీర భాగాలు అన్నీ పనిచేస్తూ వుంటే లాక్టిక్ యాసిడ్‌తో పాటు మరికొన్ని విషపూరిత పదార్ధాలు కూడా తయారై రక్తంద్వారా శరీరమంతటా వ్యాపించి మెదడును కూడా అలసిపోయేలా చేస్తాయి.

 గోళ్లు, వెంట్రుకలను కత్తిరిస్తే నొప్పి పుట్టదు

ఒంటి మీద ఎక్కడ చిన్న దెబ్బ తగిలినా మనకు ఎంతో బాధ కలుగుతుంది. కాని గోళ్లు, వెంట్రుకలు మన శరీరంలో భాగాలే అయినా వాటిని కత్తిరిస్తే నొప్పి పుట్టదు. ఎందుకంటే గోళ్లు అనేవి మృతకణాలతో నిండిన ఒక గట్టి పదార్థం. గోళ్ల కింద చర్మం ఇతర శరీర భాగాల్లో ఉండే చర్మంలాగానే ఉంటుంది. వీటి మొదలు వేళ్లలోని చర్మం లోపల కొంతలోతు వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక ప్రత్యేక కణజాలం ఉండటం వల్ల వీటికి సాగే గుణం ఉంటుంది. ఇవి రోజూ కొద్ది మేరకు పెరుగుతుంటాయి. ఇవి మృతకణాలతో నిండి ఉన్నాయి కనుక వీటిని కత్తిరించినా మనకు నొప్పి, బాధ ఉండదు. అదే కొంచెం లోపలికి కత్తిరించినా లేదా కొరికినా భరించలేనంత బాధ ఉంటుంది. ఇక వెంట్రుకల విషయానికి వస్తే ...... ఇవి కూడా గోళ్లలాగే కెరటిన్ అనే పదార్థంతో తయారవుతాయి. వీటి చివర్లు కూడా నరాలతో అనుసంధానించి ఉండవు. అందుకే వీటిని కత్తిరించినప్పటికీ రక్తం రాదు. నొప్పి, బాధ కలగవు. అయితే వెంట్రుకలను మొదళ్ల దగ్గర పట్టుకొని లాగితే మాత్రం నొప్పి, బాధ ఉంటాయి. మొదళ్లలో కణజాలం ఉంటుంది. అవి మృతకణాలు కావు. అందుకే నొప్పిగా అనిపిస్తుంది.

కనుబొమలు

కనుబొమలు మనిషి ముఖానికి ఒక ప్రత్యేకతను ఇస్తాయి. కొందరి కనుబొమలు విల్లులా వంపు తిరిగి, అందంగా ఉంటే, ఇంకొందరికి దట్టంగా .... అడ్డదిడ్డంగా పెరిగి ఉంటాయి. కొందరు తమ కనుబొమలను అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం వేలాది రూపాయలు ఖర్చుచేస్తుంటారు. ఇంతకీ కనుబొమలెందుకో తెలుసా. దీనికి ఇదీ కారణం అని ప్రత్యేకంగా ఎవరూ నిరూపించలేకపోయారు కానీ, అంచనాల ప్రకారం కనుబొమలు ఉండటం వల్ల కళ్లకు హాని కలగకుండా ఉంటుంది. చెమట నేరుగా కళ్లలోకి పోదు. దుమ్ము ధూళి నుంచి కంటికి రక్షణ కలుగుతుంది. మన మనసులోని భావాలను కనుబొమల ద్వారా వ్యక్తం చేయవచ్చు. నాట్యకారులు కనుబొమల ద్వారా చక్కటి భావవ్యక్తీకరణ చేస్తారు. మనం కూడా కనుబొమలు ముడి వేస్తే ఒక భావం, కనుబొమలు ఎగరవేస్తే ఒక భావన .... ఇలాగన్నమాట. అసలు కనుబొమలే లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా బాగుండదు.

 కనుబొమలు తీసియడం నేరమని తెలుసా. 

వేళ్లు చిటపటమనడం

ఓ గంట ఏకబిగిన పని చేస్తే వేళ్లు పట్టేసినట్లుంటాయి. రెండు చేతులను వేళ్లను ఇంటర్‌లాక్ చేసి వెనక్కి విరిస్తే టపటపమని చిరు టపాకాయల్లా పేలుతాయి. దాంతో కీళ్లు హాయిగా అనిపించి మళ్లీ పనిలో పడుతుంటాం. అయితే ఇలా కీళ్లు దగ్గర పట్టేయడం, విరిస్తే పటపటమనడం వంటి లక్షణాలు ఆర్థరైటిస్ వ్యాధికి సూచనలు అని కొందరు భయపడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వేళ్ల కణుపుల దగ్గర సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. వేళ్లను లాగినప్పుడు ఈ ఫ్లూయిడ్ కీళ్ల మధ్య సరిగ్గా విస్తరిస్తుంది. ఈ ఫ్లూయిడ్‌తోపాటుగా కణుపుల దగ్గర నైట్రోజెన్ వాయువుతో నిండిన చిన్నచిన్న బుడగలు ఉంటాయి. వేళ్లను విరిచినప్పుడు ఆ బుడగలు పేలినట్లవుతాయి. మనం వినే శబ్దం ఆ బుడగలు పేలినప్పుడు వచ్చేదే. ఇది ఆర్థరైటిస్‌కు దారి తీసే పరిణామం ఎంత మాత్రమూ కాదు. 

త్రేన్పులు రావడం

కడుపునిండా తిన్న తర్వాత త్రేన్పులు రావడం సహజమే. పాలిచ్చిన తర్వాత తల్లి పసిబిడ్డను భుజాన వేసుకొని, వీపు మీద నెమ్మదిగా అరచేతితో రాస్తుంది. బిడ్డ త్రేన్చిన వెంటనే పడుకోబెడుతుంది. లేదంటే తాగిన పాలు కక్కేస్తాడు బిడ్డ. ఇంతకీ త్రేన్పు ఎందుకు వస్తుందో తెలుసా? మనం ఏమైనా తినేటప్పుడు మనకు తెలియకుండానే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్‌డైయాక్సైడ్ వంటి వాయువులను కూడా మింగుతాము.

అలా కడుపులోకి చేరిన వాయువులు అక్కడ ఇమడవు. దాంతో మన శరీరం వాటిని బయటికి పంపే ప్రయత్నం చేస్తుంది. ఆ వాయువులు బయటికి వచ్చేటప్పుడు కొద్దిపాటి శబ్దం రావడం సహజం. అవే త్రేన్పులు. ఒక్కోసారి ఆహారం ఎక్కువగా తీసుకున్నా, అరగకపోయినా కూడా ఆహారం పులిసి, వాయువులు తయారవుతాయి. ఆ వాయువుల వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అదే త్రేన్పు వెనుక రహస్యం.

త్రేన్పు వచ్చేటప్పుడు మనకు ముందుగా తెలుస్తుంది కాబట్టి, వీలయినంత నెమ్మదిగా త్రేన్చాలి. లేదంటే సభ్యతగా ఉండదు. అవతలివారికి అసౌకర్యం కలుగకుండా నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం మంచిది. 

శరీర కణాల అద్భుతం

మనుషులే గాక భూచరాలు, జలచరాలు, పక్షులు, జీవులు, మొక్కలు అన్నింటి శరీరాలు కణాలతో నిర్మితమైనవే. మానవ శరీరంలో ఈ కణం ఒక అద్బుతం. మనిషి శరీరం మొత్తంలో 10 టు ది పవర్ ఆఫ్ 12 కంటే ఎక్కువ కణాలు ఉంటాయి. ఇవి అత్యంత సూక్ష్మమైనవి. వీటిని 2,00,000 రెట్లు పెద్దవిగా చూపించే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లలో కూడా ఇవి స్పష్టంగా కనబడవు.

కణాలు విభిన్న ఆకారాలలో గుండ్రంగా, కోలగా, నక్షత్రాల ఆకారంలో ఇలా రకరకాలుగా ఉంటాయి. అనేక రకాలుగా జీవితంలో కణవిభజన జరుగుతూ ఉండటం వల్లనే ప్రాణులలో ఎదుగుదల, జీవక్రియలు సాధ్యం అవుతున్నాయి. ఆహారాన్ని, ఆక్సిజన్‌ను గ్రహించడం, వ్యర్ధ పదార్ధాలను బహిష్కరించడం లాంటి వన్నీ కణాలే చేస్తాయి.

కణాలు, విపరీతంగా సంకోచ వ్యాకోచాల గుణాన్ని కలిగి ఉంటాయి. కణాల అల్లిక వల్లనే కణజాలం ఏర్పడుతుంది. వీటి వల్లనే శరీర భాగాలు తయారవుతాయి. 

ఆహారం విషపూరితం అగుట

                  జీవశాస్త్ర పరిబాషలో ఆహారం విషపూరితం 

కావడాన్ని బాట్యులిజమ్ అంటారు. ఆహారం విషపూరితం 

అంటే ఆహారంలో విషం కలపడం కాదు కాని కొన్ని ప్రత్యేక 

కారణాల వల్ల ఆహారం దానంతట అదే విషపూరితం కావడాన్ని

 ఆహారం విషపూరితం (ఫుడ్‌పాయిజన్) అంటారు.


                 ఆహారాన్ని అపరిశుభ్రమైన ప్రదేశంలో 

ఎక్కువకాలం నిల్వ వుంచినపుడు అది కుళ్లిపేతుంది. దీనిలో 

ప్రమాదకరమైన బాక్టీరియా పెరుగుతుంది. దాంతో భరించరాని

 దుర్వాసన వస్తుంది. ఇలాంటి అహారాన్ని విషాహారం 

అంటారు.

                   ఆహారంలో సీసం, తుత్తునాగం, రాగి మొదలైనవి

 కలవడం వల్ల కూడా ఆహారం విషంగా మారే అవకాశం వుంది.

 సరిగా శుభ్రం చేయని కూరగాయలు, ఆకుకూరలు వల్ల

 అందులోని సూక్షజీవులు ఆహారాన్ని విషపూరితం చేస్తయి

. కుళ్లిన కాయగూరలను వండటం, బల్లి, సాలెపురుగుల

 వంటివి ఆహారంలో పడటం వల్ల కూడా ఆహారం విషపూరితం

 అవుతుంది.

                    పంటలు, కూరగాయల మీద చల్లే క్రిమిసంహారక

 మందులను సరిగా శుభ్రం చేయకుండా వండటం వల్ల ఆహారం

 విషపూరితం అవుతుంది.  


 కిడ్నీలో రాళ్లు


       కిడ్నీ (మూత్రపిండాలు) ల్లో రాళ్లు ఏర్పడినట్లు 

అప్పుడప్పుడు వింటుంటాం. కిడ్నీల్లోనే గాక కాలేయంలో, 

పిత్తాశయంలో కూడా రాళ్లు ఏర్పడవచ్చు. ఇవి మనం 

ఆహారంలో పొరపాటున తీసుకునే రాళ్లు కావు. శరీరంలో 

కొన్నిరకాల ఆసిడ్స (ఆమ్లాలు), ఇతర పదార్ధాల వల్ల ఈ 

రాళ్లు ఏర్పడతాయి.

        వైద్యపరిభాషలో ఈ రాళ్లను కాలిక్యులై అంటారు. ఈ

 రాళ్లు మూత్రవాహికలో ఇన్‌ఫెక్షన్లు వున్నప్పుడు, మూత్రం

 నిల్వ వుండిపోయినప్పుడు, తగినంత నీరు తాగకపోవడం,

 ఆసిడ్ కలుగజేసే పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల 

ఏర్పడతాయి.

         మూత్రంలో క్షారగుణం వుంటే కాల్షియం ఫాస్ఫేటు, 

అమోనియం యూరేట్, మెగ్నీషియం ఫస్పేటులతో కూడిన 

రాళ్లు ఏర్పడతాయి. రాళ్లు ఏర్పడినపుడు తీవ్రంగా 

కడుపునొప్పి వస్తుంటుంది. వివిధ రసాయనాలతో పాటు చెడు

 బ్యాక్టీరియా, ఎపితీలియల్, చీముకణాలు రాళ్లను మరింత

 దృఢతరం చేస్తాయి.

 

                  ఆంటిన్ వాన్ లీవెన్ హక్                

                         (24.10.1632 --- 26.08.1723)

                          క్రిమిశాస్త్ర పితామహుడు

    హాలెండ్దేశంలోని దెల్ఫీప్రాంతానికి చెందిన ఆంటిన్ వాన్

 లీవెన్  హక్ అనే వ్యక్తి సూక్షజీవులపై విస్తృతంగా 

పరిశోధనలు చేశారు. సూక్షజీవులను గురించి ప్రపంచానికి

 తెలియజేసి,  మానవాళికి మహోపకారం చేశాడు ఈయన. 

 హక్ శాస్త్రవేత్త  కాదు. ఒక మామూలు వ్యాపారి. అయితే 

గాజుముక్కలను  భూతద్దాలుగా తయారుచేసి, వాటితో 

బట్టలలోని నాణ్యతను గమణించడం ఒక వ్యాపకంగా 

పెట్టుకున్నాడు. అంతేకాదు కంటికి కనిపించే ప్రతివస్తువునూ 

 తాను స్వయంగా తయారుచేసుకున్న కటకాలతో శ్రద్ధగా 

పరిశీలిస్తుండేవాడు.  పేను కాళ్లు, ఈగల రెక్కలు, గొర్రెల 

వెంట్రుకలు, మనుషుల  చర్మాల మీది పొలుసులను 

కటకాలతో పరీక్షిస్తుండేవాడు.

          హక్ ఒకసారి నీటిబొట్టును కటకంతో పరిశీలిస్తుండగా

 అందులోవున్న సూక్ష్మజీవులను చూసి ఆశ్చర్యపోయాడు.

 తర్వాత లండన్‌లోని రాయల్ సొసైటీకి ఈ విషయాన్ని 

ఉత్తరాలు రాశాడు. హక్ తన జీవితకాలంలో ఎన్నోరకాల 

సూక్ష్మజీవులను కనుగొని, వాటి గురించి వివరంగా వర్ణించి,

 బొమ్మల గీసి భద్రపరిచాడు. లీవెన్‌హక్‌ను 

క్రిమిశాస్త్రపితామహునిగా 

పేర్కొంటారు. సూక్షజీవులను గురించి లోకానికి తెలియజేసిన

 మొట్టమొదటి వ్యక్తి హక్.

 

అందరి రక్తం ఒకే విధంగా ఉండదని, రక్తంలో గ్రూపులు ఉంటాయని కనుగొని మానవజాతికి మహోపకారం చేసిన శాస్త్రవేత్త కార్ల లాండ్ స్టీనర్.

ఆస్ట్రియా దేశంలోని బాడెన్‌లో 1868 జూన్ 14న జన్మించిన స్టీనర్‌కు చిన్ననాటి నుండి వైద్యరంగం అంటే ఎంతో ఇష్టం. వైద్యవిద్యతో పాటు ప్రత్యేకంగా రసాయన శాస్త్రం కూడా అభ్యసించిన స్టీనర్ 1908లో విధేల్ మైనన్ హాస్పిటల్‌లో ఆఫీసర్‌గానూ, 1922లో న్యూయార్క్‌లోని రాక్ ఫెల్లర్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఆఫీసర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. రక్తదాత, రక్త గ్రహీతల రక్తం గ్రూపు ఒకటే ఉండాలని తెలియని రోజుల్లో ఒకరి రక్తం మరొకరికి ఎక్కిస్తే ఆ రోగి చనిపోతే రక్త కలుషితం అయిందని అనుకునేవారు.

రక్తానికి సంబంధించిన ఈ రహస్యాన్ని కనుగొనడానికి ప్రయోగాలు ప్రారంభించిన స్టీనర్ వివిధ రక్త నమూనాలను సేకరించి, వీటిని సమ్మిళితం చేసి, మైక్రోస్కోప్‌లో పరీక్షించాడు. కొన్ని రక్తాలను కలిపినప్పుడు అందులోని ఎర్ర రక్త కణాలన్నీ ఒక చోట గుంపుగా చేరి విరిగిపోయినట్లు కనిపించడంతో, అలా విరిగే రక్తాన్ని, విరగని రక్తాన్ని వేరు వేరుగా గుర్తించాడు. దీంతో రక్తాన్ని ఏ, బి, ఏబి, ఓ అనే నాలుగు గ్రూపులుగా విభజించాడు. రక్తంలో గ్రూపులను కనుగొన్నందుకు స్టీనర్‌కు 1930లో నోబెల్ పురస్కారం లభించింది. 

 వ్యాధికారక పరాన్నజీవులు

           వ్యాధులకు దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు కారణం కాదని, శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక పరాన్న జీవులే కారణం అని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వైద్యుడు పరా సెల్సస్. ఇతను 1493లో స్విట్జర్లాండ్‌లోని మిన్‌సీపెల్ పట్టణంలో జన్మించాడు. ఈయన అసలు పేరు చాలా పొడవైన వేరే పేరు. థియో ప్రాస్టస్ బొంబాస్టస్ వాన్ హూ హెన్ హైమ్ అసలు పేరు. పరా సెల్సస్ అనేది ఆయన పెట్టుకున్న పేరు. ఆయన తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. ఆయన కూడా వైద్య విద్య అభ్యసించాడు. పాతకాలపు చికిత్స పద్ధతులను, వ్యాధులకు సంబంధించిన మూఢనమ్మకాలను ఆయన పరుషపదజాలంతో తీవ్రంగా విమర్శించేవాడు.

                      రకరకాల వ్యాధులకు రకరకాల ఔషధాలు వాడాలని, శరీరంలో పరాన్న జీవులను అరికట్టడానికి రసాయన మిశ్రమ ఔషధాలను సేవించాలని ఆయన ప్రపంచానికి చాటాడు. ఆయన చెప్పిన పరాన్నజీవుల సిద్ధాంతం తర్వాత సూక్ష్మజీవులు (జెర్మ్) సిద్ధాంతానికి దారి చూపింది. మూఢనమ్మకాలను, వైద్యరంగంలో వాటి వల్ల కలిగే ఇబ్బందులను తూవ్రంగా విమర్శించినందుకు ఆయనను నగరం విడిచి వెళ్లాలని ఆదేశించారు. 1541లో ఆయన అనాధగా మరణించాడు.

శుశ్రుతుడు

           చికిత్సలు రెండు రకాలు. ఒకటి ఔషద చికిత్స - అంటే

 మందులతో వ్యాధిని నయం చేయడం. రెండవది శస్త్రచికిత్స

 (ఆపరేషన్) - అంటే శరీరంలో వ్యాధిగ్రస్థమైన భాగాన్ని కోసి 

తొలగించివేయడం. ఇటువంటి శస్త్రచికిత్స విధానానికి 

మూలపురుషుడు శుశ్రుతుడు.

            ఈయన ఉత్తర భారతదేశానికి చెందినవాడు. ఈయన క్రీ.పూ. 1500 వాడని అంటారు. ఈయన కాశీరాజైన

 దివోదాసుధన్వంతరి వద్ద వైధానాలను అభ్యసించాడు. 

శస్త్రచికిత్స విధానానికి సంబంధించి శుశ్రుతుడు శుశ్రుత 

శల్యతంత్రం లేక శుశ్రుత సంహితఅనే ఒక మహాగ్రంధాన్ని

 రచించాడు. ఇందులో సూత్ర స్థానం, నిదాన స్థానం, శరీర 

స్థానం, చికిత్స స్థానం, కల్ప స్థానం అనే అయిదు భాగాలు

 వుంటాయి. మొత్తం 120 అధ్యాయాలున్న మహాగ్రంధం ఇది.

 వైద్య విద్య అభ్యసించేవారికి ఇది ఒక విజ్ఞానసర్వస్వం.

          శస్త్రచికిత్సకు ఉపకరించే 24 రకాల యంత్రాలు, 101

 రకాల శస్త్రచికిత్స సాధనాలను గురించి శుశ్రుతుడు ఆ 

కాలంలోనే వివరించడం విశేషం. 

చరకుడు

      ఆయుర్వేద వైద్యానికి పితామహుని వంటివాడు చరకుడు. ఈయన క్రీ.పూ. 5,6 శతాబ్దాల కాలానికి చెందినవాడు. మన దేశంలో గాంధార ప్రాంతానికి చెందినవాడు. చరకుడు గొప్ప ఆయుర్వేద వైద్యుడే గాక ఆయుర్వేద గ్రంధాలు కూడా రాశాడు. అందులో చరకసంహిత ఎంతో ప్రసిద్ధి చెందింది. 

             చరకసంహితలో ఎనిమిది భాగాలున్నాయి. అవి సూత్రస్ధానం, నిదానస్ధానం, విమానస్ధానం, శరీరస్ధానం, ఇంద్రియస్ధానం, చికిత్సా స్ధానం, కల్పిస్ధానం, సిద్ధి స్ధానం.

              చరకసంహితలో 220 అధ్యాయాలు వున్నాయి. ఈ సూత్రాలు శ్లోకాల రూపాంలో పొందుపరచి వున్నాయి.చరకసంహితను క్రీ.శ. 8వ శతాబ్దంలో అరబ్బీ, పర్షియా బాషలలోకి అనువదించబడింది.

               శరీరంలో వాతం, పిత్తం, కఫం అనే మూడు దురవస్ధలు అనారోగ్యానికి కారణం అవుతున్నాయిని చరకుడు చెప్పిన సిద్ధాంతాన్ని ఈ నాటికి ఆయుర్వేద వైద్యులు అనుసరిస్తున్నారు.

                ఆరోగ్యరక్షణ, శరీరపరిరక్షణ కోసం ఎన్నెన్నో సూచనలను చరకుడు ఆనాడే చేశాడు. అవి ఈనాటికీ ఆచరణీయాలే.  

Make a Free Website with Yola.