కంప్యూటర్‌కి వైరస్

కంప్యూటర్‌ను పనిచేయించేందుకు మనం కొన్ని ఆజ్ఞలు (కమాండ్స్) వినియోగించాలి. ఈ కమాండ్స్ అన్నింటినీ కలిపి సాఫ్ట్‌వేర్ అంటారు. కంప్యూటర్ ఏ విధంగా ఏ పనులు చేయాలనేది సాఫ్ట్‌వేర్ నిర్ణయిస్తుంది. కంప్యూటర్ పనితీరు గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్నవారిలో కొంతమంది సరదాకోసమో, దురాలోచనతోనో కొన్నిరకాల సాఫ్ట్‌వేర్లను తయారుచేస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌లు కంప్యూటర్లను తప్పుదారి పట్టించడం, పనిచేయకుండా నిలిచిపోయేలా చేయడం లేదా నిల్వవున్న సమాచారం చెరిగిపోయేలా చేసి ఎంతో నష్టం కలిగిస్తాయి. ఇలాంటి సాఫ్ట్‌వేర్లనే వైరస్ అంటారు. అందుకే కంపెనీలు తయారుచేసిన వైరస్ లేని సాఫ్ట్‌వేర్‌ను వాడటం శ్రేయస్కరం. ఇంటర్‌నెట్ నుంచి సమాచారాన్ని తీసుకునేటప్పుడు ఇ-మెయిల్స్ చూసేటప్పుడు, కొత్త సాఫ్ట్‌వేర్‌ను లోడ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మానవ వైరస్‌లకు టీకాలు ఎలాగో, కంప్యూటర్ వైైరస్‌లను యాంటీవైరస్ సాఫ్టవేర్ ల ద్వారా తొలగించుకోవచ్చు. 

వేసవిలో ముదురు రంగుల బట్టలు ధరించకూడదు

మండువేసవిలో నల్లటి నలుపు, ముదురు ఎరుపు, ముదురు నీలిరంగు, ఆకుపచ్చరంగు దుస్తులు ధరించకూడదు. ముదురు రంగులో కాంతిని అంటే వేడిమిని గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది. అందుకే వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు ముదురు రంగు దుస్తులు ముఖ్యంగా నల్లటి దుస్తులు ధరించినప్పుడు ఎండవేడిమి తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది. అదే లేత రంగు ముఖ్యంగా తెల్లటి తెలుపు, లేత పసుపు, క్రీమ్ కలర్, బిస్కెట్ కలర్ దుస్తులు ధరిస్తే శరీరానికి హాయిగా ఉంటుంది. లేత రంగులు వెలుతురును ప్రతిబింబింపజేస్తే, ముదురు రంగులు వేడిని గ్రహిస్తాయి. దుస్తులు కనుక వేడిని గ్రహిస్తే అది తావ్రమవుతుంది. దాంతో ఉక్కపోత, ఎండవేడికి చిరాకుగా ఉంటుంది. తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.

 

స్పార్క్ ప్లగ్

ఇంధనాలను మండించడానికి ఉపయోగపడేదే స్పార్క్ ప్లగ్.

  • ఇవి ఎక్కువగా వాహనాలలో ఉపయోగపడతాయి.
  • స్పార్క్ ప్లగ్ వాహనాలలో కంబషన్ ఇంజన్‌లోని పిస్టన్‌పై భాగంలో అమర్చబడి ఉంటుంది.
  • స్పార్క్ ప్లగ్‌లో రెండు ఎలక్ట్రోడ్‌లు ఉంటాయి.
  • ఒకటి ప్లగ్ మధ్యలో ఉంటుంది. రెండవది కేసింగ్ దిగువ భాగంలో ఉంటుంది.
  • ప్లగ్ మధ్యలో ఉండే ఎలక్ట్రోడ్ చుట్టూ పింగాణి పదార్ధం వుంటుంది. ఇది విద్యుచ్ఛక్తిని ప్రవహించనీయకుండా ఇన్సులేటర్‌లా పని చేస్తుంది. దీని చుట్టూ లోహంతో చేయబడిన ప్లగ్ కేసు ఉంటుంది. ఇది సిలిండర్‌లోకి బిగించబడి ఉంటుంది.
  • సిలిండర్ హెడ్‌లు, ప్లగ్‌కు మధ్య ఉండే ఎలక్ట్రోడ్‌లను తీగలతో కలుపుతారు. ఈ తీగలు ఇగ్నిషన్ కాయిల్‌కు కలపబడి ఉంటాయి.
  • ఇది 12 వోల్టుల శక్తిని 30,000 శక్తిగా మారుస్తుంది. దీంతో ప్లగ్‌లో ఉన్న ఖాళీ స్థలంలో స్పార్క్ పుడుతుంది.
  • ఈ స్పార్క్ సిలిండర్‌లోని ఇంధనాన్ని, వాయువుల మిశ్రమాన్ని మండిస్తుంది. దీంతో ఇంజన్‌లో చలనం కలుగుతుంది. అంటే స్పార్క్ ప్లగ్ వుండటం వల్లనే యంత్రం కదులుతుంది.

 రిమోట్ సెన్సింగ్

      అంతరిక్ష విజ్ఞానంలో రిమోట్ సెన్సింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. రిమోట్ సెన్సింగ్ అంటే వస్తువులను తాకకుండా దూరంనుంచే దానిలో ఏమి ఉన్నదో చెప్పడం.

                          రిమోట్ సెన్సింగ్ ద్వారా ఒక ప్రాంతంలో ఏమున్నదో ఫొటోలు తీసి కనిపెట్టవచ్చు. ఈ ఫొటోలలో చెట్లు ఎర్రగా, పొలాలు కణాలలాగా కనబడతాయి. రిమోట్ సెన్సింగ్ ద్వారా ఖనిజ నిక్షేపాలను గుర్తించవచ్చు. భూ శిలల స్వభావం, దాని ద్వారా వాటిలోని లోహ సంపద, ఆ ప్రాంతంలో మట్టిలోని తేమ, ఉష్ణోగ్రతలను కనుగొనవచ్చు. చమురు నిక్షేపాలను గురించి తెలుసుకోవచ్చు. అగ్ని పర్వతాల ఆచూకీ తీయవచ్చు. ఎక్కడెక్కడ ఎంత భూగర్బ జలాలు ఉన్నదీ తెలుసుకోవచ్చు. నదులు, సముద్రాల వివరాలు రాబట్టుకోవచ్చు. బయో మెడికల్ ఇంజనీరింగ్, నేర పరిశోధన మొదలైన రంగాలలో కూడా రిమోట్ సెన్సింగ్ ఉపయోగపడుతుంది.

                     1920లో మనకు రిమోట్ సెన్సింగ్ పద్ధతి మొదలైనది. రిమోట్ సెన్సింగ్ ఉష్ణోగ్రతలు పంపే సమాచారాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్.ఆర్.ఎస్.ఏ) విశ్లేషిస్తుంది.

జలాంతర్గామి

నీటిపైన, నీటిలోపల తేలుతూ ప్రయాణం చేయగల ఓడను జలాంతర్గామి అంటారు. ఇది సముద్రంలో చాలా లోతుకు వెళ్లగలవు.అనాదికాలం నుండి మానవులు సముద్రం అడుగుకు వెళ్లి వజ్రాలను, ముత్యాలను వెతికేందుకు ప్రయత్నాలు చేశారు, తమ ప్రయత్నాలు సఫలమయ్యేందుకుగాను నీటి లోపలకు వెళ్లగల సాధనాన్ని కనుగొనాలనుకున్నారు.

మొట్టమొదటగా నీటిలోపల ప్రయాణించగల జలాంతర్గామిని 1620లో హాలెండ్‌కు చెందిన కార్నేలియస్ వాన్ డ్రబ్బెల్ తయారుచేశాడు. ఈ జలాంతర్గామిని కొయ్యతో తయారుచేసి, చుట్టూ తోలును కప్పాడు. ఇది సముద్రం ఉపరితలం నుండి 3 నుండి 4 మీటర్ల లోతు వరకూ వెళ్లగలదు.

తర్వాత అనేకరకాలైన జలాంతర్గాములను రూపొందించడానికి ప్రయత్నాలు జరిగాయి. 18వ శతాబ్దం చివరి వరకూ అనేకరకాల జలాంతర్గాములను రూపొందించారు. ఆవిరియంత్రంతో నడిచే జలాంతర్గామిని 1880లో నిర్మించారు. తర్వాత విద్యుత్‌తో నడిచే వాటిని రూపొందించారు.

మొదటి ప్రపంచయుద్ధంలో (1914 - 1918) జలాంతర్గాములను ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో (1939 - 1945) డీజిల్‌తో నడిచే జలాంతర్గాములను ఉపయోగించారు.

ఆవిరికి శక్తి చాలా ఉంది 

         ఆవిరికి చాలా శక్తి ఉందని డెనిస్ పాపిన్ తెలుసుకున్నారు. దానిని అర్ధం చేసుకోవడం వల్లే ప్రెషర్ కుక్కర్ కనుక్కోగలిగారు. నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడు వద్దకు రాగానే ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. గాల్లో కలిసిపోతే దాని శక్తి వృధా అవుతుంది. కాబట్టి దాన్ని బంధించగలిగితే ఉపయోగం ఉంటుందని భావించారు డెనిస్. ఆయనకు ఆ ఆలోచన రావడమే కుక్కర్ అంకురార్పణ.

             ఒక పాత్రలో నీరు పోసి దానికి ఒక మూతపెట్టి లాక్ చేశారు. ఆవిరి బయటకు పోయే అవకాశం లేకుండా చర్య తీసుకున్నారు. దీంతో ఆ పాత్రలోని ఉష్ణోగ్రత 100 కంటే ఎక్కువ నమోదైంది. అయితే, అత్యధిక ఒత్తిడి వల్ల పాత్ర పేలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అతను ఒత్తిడిని ఓ పరిమితిలో ఉంచడానికి ఓ వాల్వును తయారుచేశారు. దీంతో ప్రెషర్‌కుక్కర్‌కు సంబంధించి 1679లోనే ఆవిష్కరణ జరిగినట్లయింది.

                          ఫ్రాన్స్‌కు చెందిన పాపిన్ ఇంగ్లాండ్‌లో ఈ పరిశోధనలు చేశారు. ఈ ఆవిరిని బంధించి మరింత వేడిని సృష్టించవచ్చని కనుగొన్న ఆయనకు లండన్ రాయల్ సొసైటీలో సభ్యతం వచ్చింది. కింగ్ చార్లెస్-2 కు ఆయన 1682 ఏప్రిల్ 12న సాధారణ సమయం కంటే తక్కువ సమయంలో డెమో గా పదార్ధాలను ఉడికించి చూపించారు. అలా మొదటి కుక్కర్ వంట అధికారికంగా రాజు గారు ఆరగించారు. 

ప్రమాదాలకు సంకేతంగా ఎరుపు రంగు

ఎరుపు రంగును ప్రమాదాలను సూచించడానికి వాడతారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్‌లో సైతం ఎరుపు రంగు వెలిగిందంటే వాహనాలన్నీ ఆగిపోవలసిందే. ఇలా అన్నింటికీ ఎరుపురంగును వాడటానికి కారణం ఆ రంగుకు గల ఒక ప్రత్యేక లక్షణమే. అదేంటంటే కంటికి కనిపించే అన్ని రంగుల్లోకెల్లా ఎరుపురంగుకు ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది. అంటే రంగులన్నీ తరంగాల రూపంలో ప్రసారమవుతుంటాయి కదా. అలల రూపంలో వెళుతున్న తరంగాలలో వరుసగా ఉన్న రెండింటి మధ్య దూరమే తరంగదైర్ఘ్యం. నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్నరాయిని వదిలితే చిన్న తరంగాలు, పెద్దరాయిని జారవిడిస్తే పెద్ద తరంగాలు ఏర్పడతాయి. చిన్న తరంగాలకు తక్కువ తరంగదైర్ఘ్యం, పెద్ద తరంగాలకు ఎక్కువ తరంగదైర్ఝ్యం ఉంటుంది. పెద్ద తరంగాలు ఎక్కువ దూరం కనిపించడానికి కారణం వాటి తరంగదైర్ఘ్యమే. రంగులు కనిపించే విషయంలో కూడా ఇదే లక్షణం వర్తిస్తుంది. ఎక్కువ తరంగ దైర్ఘ్యమున్న ఎరుపురంగు ఎక్కువ దూరం కనిపిస్తుంది. అందువల్లే ప్రమాద సూచికగా ఎరుపురంగును వాడతారు. 

కార్డ్‌లెస్ మైక్

స్టేజీ మీద పాటలు పాడేవారు, మాట్లాడేవారు, ఒక స్టాండ్‌కు బిగించివున్న మైకును గానీ, పొడవాటి తీగ ఉన్న మైకును గానీ ఉపయోగిస్తుంటారు. వాటితో పాటు తీగ లేకుండా ఉండే మైకులను ఉపయోగించడం చూడవచ్చు. దీన్నే వైర్‌లెస్ లేదా కార్డ్‌లెస్ మైక్ అని వ్యవహరిస్తారు.

 వైర్‌లెస్ లేదా కార్డ్‌లెస్ పద్దతిలో పని చేసే అనేక పరికరాలు ఉన్నాయి.  వైర్‌లెస్ లేదా కార్డ్‌లెస్ మైక్ లోపల ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ వుంటుంది. ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ వల్ల శబ్దతరంగాలు విద్యుత్‌తరంగాలుగా మారుతాయి. ఆ తరువాత అవి మైక్రోవేవ్ తరంగాలు లేక రేడియో తరంగాలుగా మారుతాయి. ఇవి విద్యుత్తు అయస్కాంత తరంగాలు. వైర్‌లెస్ లేదా కార్డ్‌లెస్ మైక్ ఉపయోగించే చోట దాని సమీపంలో యాంప్లిఫయర్ ఉంటుంది. ఈ యాంప్లిఫయర్‌లో మరో ప్రత్యేకమైన ఎరక్ట్రానిక్ సర్క్యూట్ ఈ విద్యుదయస్కాంత తరంగాలను తిరిగి విద్యుత్ తరంగాలుగా మార్చేస్తుంది. వీటిని తిరిగి మైక్‌స్పీకర్‌కు అనుసంధానం చేయడం వల్ల ఆ శబ్దాలు వినిపిస్తాయి.  

కంప్యూటర్

యంత్రాలలోకెల్లా అద్భుతమైన యంత్రంగా కొనియాడబడుతున్న కంప్యూటర్‌ను 1944లో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంవారు మొట్టమొదటిసారిగా రూపొందించారు. ప్రొఫెసర్ హోవర్డ్ ఐకిన్, ఆయన బృందం కలిసి దీన్ని తయారుచేశారు. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ కార్పొరేషన్ అనే సంస్థ కూడా దీని తయారీలో సంపూర్ణ సహకారం అందించింది. మొట్టమొదట తయారైన ఈ కంప్యూటర్ పేరు హార్వర్డ్ ఐ.బి.ఎం. (HARVARD IBM)

దీని తర్వాత అనేక రకాలైన కంప్యూటర్లు తయారయ్యాయి. విమానాలను, అంతరిక్ష నౌకలను, రాకెట్లను, అస్త్రాలను నేల మీద నుంచే మన ఆధీనంలో వుంచుకుని సలహాలను ఇవ్వగల కంప్యూటర్లు కూడా క్రమంగా తయారయ్యాయి. రాకెట్లు ఎగురుతున్నప్పుడు వాటి దిశను, వేగాన్ని కూడా కంప్యూటర్లు మార్చగలిగేలా రూపుదిద్దుకున్నాయి.

అతిక్లిష్టమైన గణితశాస్త్ర సమస్యలను తృటిలో పరిష్కరించగల సామర్ధ్యం కంప్యూటర్లకు వుండటంతో జనజీవనంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంప్యూటర్లను తొలిరోజుల్లో ఎలక్ట్రానిక్ మెదడు గా అభివర్ణించారు. ముఖ్యంగా కంప్యూటర్స్‌లో వుండే మెమొరీ పవర్ వల్ల ఇది దీర్ఘకాల ప్రయోజనాన్ని సంతరించుకుంది. 

                                               
     ట్రాఫిక్ సిగ్నల్స్

1868 లో ఇంగ్లాండ్‌లోని జార్జ్‌స్ట్రీట్, బ్రిడ్జ్‌స్ట్రీట్ కలిసే కూడలిలో

 ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రపంచంలో మొట్టమొదటిసారి 

ఏర్పాటుచేశారు. అయితే ఇప్పటిలాగా అవి

 ఆధునికమైనవికావు.

        7 మీటర్ల ఎత్తున స్తంభాల మీద పెట్రోలుతో దీపాలను 

అమర్చారు. అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడి దీపాల 

విషయం అందరికీ చెపుతుండేవాడు.

         1920లో కొంత ఆధునికమైన ఎలక్ట్రిక్ ట్రాఫిక్ 

సిగ్నల్స్‌ను డెట్రాయిట్ సమీపంలో ఉడ్‌వర్డ్, మిచిగాన్ 

ఎవెన్యూల మధ్య ఏర్పాటు చేశారు.

          తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ మరింత ఆధునికం అయ్యాయి.

 లుడోవిసి నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అధిగమించిన వారికి 

జరిమానా విధించడం కూడా ఆరోజుల్లోనే జరిగేది. 

బ్యాటరీ సెల్ పని విదానము

                  ట్రాన్సిస్టర్లు, టార్చ్‌లైట్లలో బ్యాటరీ సెల్స్ ఉంటాయి.

*** బ్యాటరీ సెల్‌లో జింక్‌తో తయారు చేసిన పాత్ర ఉంటుంది.

*** ఇత్తడి మూతవున్న కర్బనపు కడ్డీ ఈ పాత్ర మధ్యలో ఉంటుంది.

*** జింక్ నెగటివ్ ఎలక్ట్రోడ్ గాను , కర్బనం పాజిటివ్ ఎలక్ట్రోడ్ గాను పనిచేస్తాయి.

*** కర్బనపు కడ్డీ చుట్టూ అమోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, మాంగనీస్ డయోక్సైడ్, కర్బనం నిండుగా కూరినట్లు ఉంటాయి.

*** దీనిచుట్టూ ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్, అమోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్‌ల మిశ్రమాన్ని నింపుతారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల ఈ మిశ్రమం గట్టిపడుతుంది.

*** జింక్ పాత్రపైన పలుచటి రేకు ఉంటుంది. బ్యాటరీ సెల్ ఎలక్ట్రోడ్‌లను తీగలతో కలిపినపుడు విద్యుత్ పుడుతుంది.

*** ఈ ప్రక్రియలో ఉదజని వాయువు కూడా ఉత్పత్తి అవుతుంది. మాంగనీస్ డయాక్సైడ్ వల్ల ఈ వాయువు నీరు రూపంలోకి మారుతుంది.

*** మాంగనీస్ డయాక్సైడ్ ఉన్నంత వరకూ బ్యాటరీ సెల్‌లో విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది.

*** ఇది మాంగనీస్ ఆక్సైడ్‌గా మారిపోతే ఇక విద్యుత్ ఉత్పత్తి కాదు. అంటే బ్యాటరీ సెల్ నిరుపయోగం అయిపోతుందన్న మాట.  

మాస్టర్ హెల్త్ చెకప్

 సాధారణంగా లభ్యమయ్యే ముఖ్య పరీక్షలు

  • బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ (పరగడుపున), పోస్ట్ లంచ్ (ఆహారం తీసుకున్న తర్వాత)
  • హెమోగ్రామ్
  • బ్లడ్ గ్రూప్‌ను నిర్ధారించే పరీక్ష (ఆర్‌హెచ్ ఫ్యాక్టర్స్‌తో)
  • లిపిడ్ ప్రొఫైల్ (డైరెక్ట్ ఎల్‌డిఎల్)
  • బ్లడ్ యూరియా
  • సీరమ్ క్రయోటనైన్
  • లివర్ ఫంక్షన్ టెస్ట్
  • కంప్లీట్ యూరిన్ స్టడీ
  • స్టూల్ రొటీన్ చెక్
  • టు డి ఎకో
  • థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టిఎస్‌హెచ్)
  • ఇ.సి.జి(ఎలక్ట్రో కార్డియోగ్రామ్)
  • ఎక్స్ - రే చెస్ట్ పిఎ వ్యూ
  • అల్ట్రాసౌండ్ (హోల్ అబ్డామిన్)
  • బాడీ మాస్ ఇండెక్స్
  • ఫిజీషియన్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవడం
  • డైటీషియన్‌ను సంప్రదించి పాటించాల్సిన ఆహార నియమాలను తెలుసుకోవడం
కొన్ని చోట్ల ప్యాకేజీలను బట్టి కొన్ని పరీక్షలు అదనముగా ఉండవచ్చు.

 
Make a Free Website with Yola.